పోలీసులకే సవాల్.. నిఘా పెట్టగానే సర్వర్లు మార్చేస్తున్న బెట్టింగ్ యాప్‌లు!

  • పోలీసుల నిఘా నుంచి తప్పించుకుంటున్న బెట్టింగ్ యాప్‌లు
  • నిఘా ఉందని తెలియగానే డొమైన్, సర్వర్ల మార్పు
  • సాలెగూడులా పదుల సంఖ్యలో ఖాతాలకు నగదు బదిలీ
  • వీఎల్ బుక్ యాప్ కేసు విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
  • ఒక్కో ఖాతాలో రూ.10 లక్షలకు పైగా లావాదేవీల గుర్తింపు
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలు పోలీసులకే సవాల్ విసురుతున్నాయి. తమపై నిఘా పడిందని అనుమానం రాగానే.. డొమైన్ పేరు, సర్వర్‌ను మార్చేస్తూ సాంకేతికంగా తప్పించుకుంటున్నాయి. విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న వీఎల్ బుక్ యాప్ కేసులో ఈ హైటెక్ ఎత్తుగడలు వెలుగులోకి వచ్చాయి. ఒక వెబ్‌సైట్‌ను పోలీసులు బ్లాక్ చేసినా, తమ కార్యకలాపాలకు, ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి నష్టం జరగకుండా నిర్వాహకులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పాత యాప్ మూతపడగానే, కొత్త పేరుతో మరో యాప్ పుట్టుకొస్తోంది.

విచారణలో భాగంగా పోలీసులు బెట్టింగ్ ముఠాల నగదు బదిలీ విధానాన్ని గుర్తించారు. పందెం కాసేవారు ఏజెంట్లు చెప్పిన ఖాతాలో డబ్బు జమ చేయగానే, ఆ మొత్తం వెంటనే మరో ఖాతాకు బదిలీ అవుతోంది. ఇలా సాలెగూడులా ఒకదాని నుంచి మరొకదానికి నిధులు మళ్లుతున్నాయి. ఇప్పటివరకు పోలీసులు సుమారు 30 బ్యాంకు ఖాతాలను గుర్తించి, వాటిలో 10 ఖాతాల కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఒక్కో ఖాతాలో కనీసం రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు తేలింది.

బెట్టింగ్ రాయుళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు 24 గంటలూ పనిచేసే కస్టమర్ కేర్ సెంటర్లను కూడా నడుపుతున్నారు. డబ్బు సులువుగా జమ చేసేందుకు క్యూఆర్ కోడ్‌ను అందిస్తున్నారు. డబ్బు బదిలీ చేసి, ఆ ఫొటోను వాట్సప్‌లో పంపితే చాలు.. 30 సెకన్లలోనే ఆ మొత్తాన్ని బెట్టింగ్ వ్యాలెట్‌కు బదిలీ చేసి మెసేజ్ పంపుతున్నారు. గెలిచిన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రం కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

Online Betting
Cricket Betting
Betting Apps
Vijayawada Police
VL Book App
Cyber Crime
Online Gambling
Illegal Activities
Money Transfer
Customer Care

More Telugu News